పాత రచనలు

1. బడిలో అమ్మఒడిలో...

Posted by డా.దార్ల On 2:49 AM

ఈ కులంలో పుట్టకపోతే
నేనూ ఇంకోలా ఆలోచించేవాణ్ణేమో
ఈ కులంలో పుట్టటమే మంచిదయింది
అవమానమంటే అర్థమైంది
అందర్నీ ప్రేమించడమూ తెలిసింది!

ప్రాచీన సాహిత్యం పాఠమైనప్పుడల్లా
నా ముఖకవళికలన్నీ మారిపోయేవి
బయటపడకూడదనో
పారిపోవాలనోబహిష్కరించాలనో
అనుకొంటుండేవాణ్ణీ
మూకుమ్మడిగా కళ్ళన్నీ నాపైనా ఫోకస్!
ఎన్నిసార్లు చంపుతావంటూదేవుణ్ణి కాలర్ పట్టుకోవాలనిపించేది!!

నాకు తెలీదు
అమ్మగర్భంలో నయినా అవమానాలకి దూరంగా ఉన్నానోలేదో
బాబుకి కాలుమీద మచ్చెలా వచ్చిందని
ఈ మధ్యనే అమ్మనడిగితే
ప్రశ్నించటం నేర్చుకుంటున్నాడేమవుతుందోనని
అనుకుంటూ తడబడతూనే చెప్పింది.
"నువ్వు కడుపులో ఉండగా పెద్ద తుఫానొచ్చింది
ఊళ్ళో జనమంతా పెద్దోళ్ళీంటికెళ్లిపోయారు
నేనూ కడుపీడ్చుకొంటూకాసింత చోటిమ్మని బతిమిలాడాను
మైలపడిపోతేచచ్చిపోతామంటూ లోనికేకాదు
పంచకే చేరనివ్వలేదు!
రివ్వురివ్వునగాలి
పెద్దపెద్ద ఉరుములు
హోరుహోరున వర్షం
ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలీదు
కూకటి వేళ్ళతో కూలిపోతున్నా
ఆచెట్లే దిక్కయ్యాయా రెండ్రోజులూ!
తుఫాను వెలిసిన మర్నాటికి
ఆకలితో నకనకలాడి కళ్ళు తిరిగి పడిపోయాను
నిండుచూలాల్ని బతికించమని
ప్రాధేయపడుతూమళ్ళా పెద్దోళ్ళింటికే వెళ్ళాడు మీ బాబు
పొద్దుకాలమంతా పెద్దోళ్ళకే కదా పనిచేసేది
కాసిన్ని గెంజినీళ్ళయినా పోయమని అర్థించాడు
కట్టెలు కొట్టుకొస్తే పోస్తామన్నారు
ఖాళీ కడుపుతోనే
తూలిపోయినాకట్టెలతో పాటు
కాలూ గాటుపెట్టుకోనైనాకాసిన్ని గెంజినీళ్లు సంపాదించాడు!
గుక్కెడు మాత్రమే గుటకేశాను
కడుపులో ఇమడలేదు
మీ బాబు రుచిచూస్తే తెలిసింది
పెద్దోళ్ళు పోసింది బియ్యం కడుగేనని!"
ఇంకెన్ని గుండెల్లో చాచుకున్నారో
గుచ్చి గుచ్చి అడిగితే తప్ప నాకు చెప్పరెప్పుడూ!
ఈ కులంలో పుట్టడమే మంచిదయింది
లేకపోతే మనుషుల్ని ప్రేమించలేకపోయేవాణ్ణేమో
అనమానాలకి తట్టుకోలేకఆగ్రహం పట్టలేక హత్యలెన్నింటినో చేసేసే వాణ్ణేమో!
(కడుపు మీద కొట్టకుండ్రి 2001- కవితాసంకలనం)
-డా.దార్ల వెంకటేశ్వర రావు

2 Response to "1. బడిలో అమ్మఒడిలో..."

  1. cbrao Said,

    మనం ఏం కులంలో పుట్టాలో అని
    ఎంపిక చేసుకునే అవకాశం మనకు లేదు. అలాగే మన తల్లి తండ్రులూను. అంతా ప్రకృతి చేతిలో ఉంది. మన ఆలోచన విధానం, సంస్కారం మనం పుట్టి పెరిగిన వాతావరణం పై ఆధార పడి ఉంటుంది. ప్రతికూల పరిస్తితులలో పెరిగిన మీరు సమాజం పై ప్రేమ కలిగి ఉండటానికీ ఏవో దోహదపడి ఉంటాయనుకుంటా. మీ తోటి మనుషులను మీరు ఇలాగే కలకాలం ప్రేమించాలని ఆశిస్తూ...

     

  2. spandana Said,

    అవును మరి. ఆ బాధేంటో అందులోవున్నవారికి గాక బయటివారికి ఎలా తెలుస్తుంది.
    అమెరికాలో నీగ్రోలను, జపానులో యూదులను పెట్టిన కష్టాలను చూసి కన్నీరు కార్చే నేను వేల ఏళ్ళ సంవత్సరాలనుండీ ఇప్పటికీ జరుగుతున్న ఈ తంతును తలుచుకుంటే గుండె చెరువవుతుంది. నిజమే ఆ కులంలో పుట్టడమే అదృష్టం. బాధించే వాడి జట్టులో గాక బాధను మింగే వాడి జట్టే ఉత్తమం కదా!
    --ప్రసాద్
    http://blog.charasala.com

     

About Me

My Photo
డా.దార్ల
Dr.Darla Venkateswara Rao, Assistant Professor, Dept .of Telugu, University of Hyderabad, (Central University), Gachibowli, Hyderabad-500 046 e-mail: vrdarla@gmail.com Ph: 040-23133563 (O), 040-23136007(R) Mobile: 09989628049,
View my complete profile