కథల్లోనో, టీవీల్లోనో సినిమాల్లోనో...
పచ్చని పొలాల్ని చూసినప్పుడల్లా
మాయమ్మా బాబుల్తో కలిసి
పురుగుల్ని పాముల్ని లెక్కచేయకుండా
రాత్రుల్ని ఎన్నింటినో లాంతరు బుడ్డుల్తో పగటిగా మార్చుకొని
గుల్లల్తోను, గూడల్తోను నీటి చుక్కల్నే తడుపుకున్న నా కళ్ళలో
పాత దృశ్యాలేవో పలకరించిపోతుంటాయి
రాత్రంతా గూడ తోడి తోడీ
గాయాల చేతుల్తోనే పొద్దున్న కారం పచ్చడి నూరుతూ
మా కళ్ళకు కనిపించకుండా మాయమ్మ పడిన బాధంతా గుర్తొచ్చి
అర్థాంతరంగానే ముగించేసి ఉండగట్టికి పోతుంటాను
హుస్సేన్ సాగర్, గండిపేట్, హిమాయత్ సాగర్...
ఏ నీటి గలగలల్ని దర్జాగా చూస్తున్నా
మా వూరిలో ప్రవహించే కాల్వలే నా కళ్ళలో...!
గోచి పెట్టుకునో, చిరిగిపోయిన లాగు కట్టుకునో
తుప్పల్ని నరికి నరికీపూడికల్ని తీసి తీసీ
వంపుసోంపుల్తో వయ్యారాల్ని నేర్పి నేర్పీ
కిలకిల నవ్విస్తూ పంటచేలల్లోకి ప్రవహింపజేసినఆకాల్వలే నా కళ్ళలో...!
అందరూ వూరిని గొప్ప గొప్పగా కీర్తిస్తుంటే
నాకు మరేదోలా వర్ణించాలనిపిస్తుందెందుకో!
నా యీడు పిల్లలంతా బళ్ళో కేరింతలు
గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చాట్లు...
దొంగ చాటుగా నేను బళ్లో దూరితే
`మనం సదూకోకూడదంటే యున్వేందిరా'
భయపెట్టే గ్రామ పెత్తందారీతనం
మాయమ్మా బాబుల గొంతుల్లో
ఆవేదన జీరకుసజీవ సాక్ష్యాలుగా
నాకనిపించే మావూరి పాఠశాల, పశువులపాకలు !
నన్నో కులం గుంపులోనో ఎన్నికల దొంగ ఓటరుగానో
అక్రమ కేసుల్లో బనాయించిన నేరస్థుడిగానో
అవసరానికో చలిమిడి ముద్ద చేసుకున్న మావూరు నను చూసి నవ్వింది!
దళితయుగం
మా వూరు నన్ను చూసి మళ్ళీ నవ్వింది!
చెట్టెక్కో పుట్టెక్కో
పట్టెడన్నంతో కడుపునిండా కొడుక్కి అక్షరాలు నింపడంతో
ఊరు అర్థంచేసుకోవాల్సినన్ని డిగ్రీలు అందుకోవడం చూసి మళ్ళీ మా వూరు నవ్వింది!
తప్పనిసరి పరిస్థితుల్లో మా బాబే కత్తిరింపు చెయ్యడం వల్లనే
మోనిగనిగలాడే దువ్విన తలతోనే
నిలువెత్తు మనిషిగా నిలబడిన నన్ను చూసి
మా వూరు మళ్ళీ నవ్వింది!
అయినా మా వూరిని నేను మరిచిపోలేను
అక్కడక్కడా రహస్య ద్వారాల రాగబంధాలుంటాయి కదా!
వాటిని బహిర్గత రహదారులుగా మార్చేందుకే
మళ్ళీ మళ్ళీ మా వూరికే నా ప్రయాణం!
(ఆదివారం ఆంధ్ర జ్యోతి 20 ఆగస్టు 2000)(`రంజనీ వారి `మా ఊరూ _ సంకలనం)
-డా.దార్ల వెంకటేశ్వర రావు
Subscribe to:
Post Comments (Atom)

మంచుగడ్దతో చేసిన గునపం గుండెలో గుచ్చుకుంటున్నట్లుగా వుంది.
--ప్రసాద్
http://blog.charasala.com