5. అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ
తొమ్మిది నెలలు నిండక ముందే
ప్రపంచంలోపడిన సంబరంతో
సంకని సంచి తగిలించిన మరుక్షణమే
నా చేతిలో...
పిచ్చుకకు రాబందు రెక్కలొచ్చిన సమాచారం
నమ్మకం నరకబడుతున్నట్లు
నీకు రెక్కలెలా వచ్చాయి
చందమామని వదలి ఉండలేనని
ఒట్టేసుకున్న వెన్నెల
ఏ సూర్య కిరణస్నానంలోనో వెలిసిపోయి
శుక్లపక్షాన్నంతా కృష్ణపక్షానికిచ్చేసిందో
చంద్రునికింక ప్రతిరాత్రీ కాళరాత్రే!
వెన్నెల్ని పున్నమిరాత్రుల్నీ చేసి విహరించటం
పచ్చని బీడుల్లో జల్లులన్నీ తొలకరి చినుకులుగా
మార్చుకొని గంతులేయటం
కాగితాల పడవల్లో కలల్ని సాగనంపటం
నీ అందెల రవళే నా ఓంకారనాదసుప్రభాతాలుగా విన్నక్షణాలు...
ఇక ఇవన్నీ
హృదయ పేటిక చివరి అరలో చాచుకున్న
చిన్ననాటి ఫోటోలయిపోవలసిందేనా?
ఏమని చెప్పనీ పిచ్చి చకోరపక్షికి?
కాగడాలు ఆరిపోకుండా
చమురు తేవటానికే
ఆఘమేఘాలమీద ఆ దేశానికి పోయావని చెప్పనా?
అదేమీ కాదు... అల్లుకొనే లతకీ
ఎన్నాళ్ళకీ పందిరి కాలేకపోయిన
అసమర్థుడిపట్ల అసహనమని చెప్పనా?
కాదు కాదు....
నీకామ మోక్ష ధర్మంఇప్పుడిప్పుడే
`అర్థమవుతుంది
పవిత్రప్రేమను కూడా
అంతర్జాతీయ మార్కెట్
ఏ బలహీనతతోనో లోబరిచేసుకుంది కదూ!
నువ్వు నుదుటి మీద కుంకమ బొట్టుపెట్టుకొనేటప్పుడు
అద్దంలో చూసుకోవద్దు
అధరామృత స్మృతి
విషబిందువై తాకిన తొలగని మచ్చేదో గుర్తొస్తుంది!
మూతబడని ఈ మూగదృశ్యాన్ని
తొలివేదనకే రాలిన మూత్యాల గుసగుసల్ని
ఏనాడైనాఇంటర్ నెట్ నుంచైనా తీసుకొని ధరించే వీలుందా?
పోన్లే...
కనీసం పోయేముందైనా
నీకనుకొలికి కోటి కాంతుల్లో
ఓ కిరణాన్నైనా విదల్చలేకపోయావా
దానితోనేపవిత్ర సైనైడ్ కౌగిలిలో మిగిలిపోయుండేవాడ్ని!!
(ఆదివారం ఆంధ్రజ్యోతి 30 ఏప్రిల్ 2000
-డా.దార్ల వెంకటేశ్వర రావు
dalit@vrdarla.org
కులపురాణాల్ని ఎలా చూడాలి?
2 days ago

"చందమామని వదలి ఉండలేనని
ఒట్టేసుకున్న వెన్నెల"....
జాబిలికీ వెన్నెలకీ వున్న అనుబంధాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు గురువుగారు!
ఈ వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడల్లా నాకు కలిగిన అనుభూతిని,ఆనందాన్నీ చెప్పాలంటే.... చాలా కష్టంగా వుంది.
అందుకోసం మళ్ళి ఓ కవిత రాయాలేమో!!!!
నిజంగా ఈ కవితలో ఎంత భావుకత నిండివుందో కదా!
"అల్లుకొనే లతకీ
ఎన్నాళ్ళకీ పందిరి కాలేకపోయిన
అసమర్థుడిపట్ల అసహనమని చెప్పనా?"
"నువ్వు నుదుటి మీద కుంకమ బొట్టుపెట్టుకొనేటప్పుడు
అద్దంలో చూసుకోవద్దు
అధరామృత స్మృతి
విషబిందువై తాకిన తొలగని మచ్చేదో గుర్తొస్తుంది!
మూతబడని ఈ మూగదృశ్యాన్ని
తొలివేదనకే రాలిన మూత్యాల గుసగుసల్ని
ఏనాడైనాఇంటర్ నెట్ నుంచైనా తీసుకొని ధరించే వీలుందా?"
యిది నిజంగా నాకు నచ్చిన కవిత.
చాలా చాలా బావుంది.
adbhutam .manasuloa nilicipoayea adbhutamayina vaakyaalu vunnayi.
అంతా బావుంది. కాని ఒక తాత్వికుడు "దళిత" అని కుల గుర్తింపు తగిలించుకోవడమే బాలేదు. తాత్వికులు యావన్మానవ జాతికీ చెందుతారనుకుంటా. కుల గుర్తింపు అంత అవసరమా ? లేదా ఈ బ్లాగు దళితేతరుల కోసం ఉద్దేశించబడింది కాదనుకోవాలా ?
చాలా చాలా బాగుంది.
అందరూ తత్వాలు చెప్తారు. కానీ దళిత తత్వమెవరూ చెప్పరు. ఏళ్ళకేళ్ళు రోజూ చూసీ చూసీ అవమానానం అవమానంగా కనపడదు, అస్పృశ్యత అంత పాపంగా కనపడదు. కానీ దళిత కోణం చూసినప్పుడే, దళితునిగా కాసేపు ఊహించుకుంటేనే గానీ ఆ భాధ తెలియదు. గట్టున కూర్చుని ఎన్నైనా చెప్పొచ్చు.
--ప్రసాద్
http://blog.charasala.com
మీ తాజా పోస్టు చూసి మీ కవితా సంపుటి పేరులో "దళిత" అన్నపదం తొలగిస్తారేమొనని భయపడి ఈ వాఖ్య రాస్తున్నా!
"నా" ఏడుపు నాదయినప్పుడు, "మీ" ఏడుపు మీదయినప్పుడు, "మహిళా" వాదం మహిళలదయినప్పుడూ, "దళితుడి" తాత్వికత దళితుడిది ఎందుకవ్వదూ? దళితుడి దృక్కోణం నుండీ తాత్వికత దళితుడి నుండే రావాలి. అది దళిత తాత్వికతే అవుతుంది. మరొకరికి ఆ తాత్వికత చెప్పటం రాదు. అందరికీ వుపయోగపడే తాత్వికత దళితుడూ చెపుతున్నట్లయితే చెప్పనీ, కానీ దళితుల మనోభావాలు, మనుసున గుచ్చుకున్న ముళ్ళ గురించి వున్న తత్వము "దళిత తత్వమే" అవ్వాలి. పేరు గొప్పగా వుంది. దాన్ని మార్చక్కర లేదు.
ఇది నా అభిప్రాయము.
--ప్రసాద్
http://blog.charasala.com
తత్వాలు..దళిత తత్వాలు, బ్రాహ్మణ తత్వాలు, కమ్మ తత్వాలు, రెడ్డి తత్వాలు. ఇలా ఉండవని నా అభిప్రాయము. అంబేద్కర్ని ఇప్పటికే జాతీయ నాయకుడి నుండి దళిత నాయకున్ని చేశారు. గోడలను కూల్చటమా? పక్కనోడి కంటే పటిష్టమైన గోడ కట్టడమా?