పాత రచనలు

1. బడిలో అమ్మఒడిలో...

Posted by డా.దార్ల On 2:49 AM 2 comments

ఈ కులంలో పుట్టకపోతే
నేనూ ఇంకోలా ఆలోచించేవాణ్ణేమో
ఈ కులంలో పుట్టటమే మంచిదయింది
అవమానమంటే అర్థమైంది
అందర్నీ ప్రేమించడమూ తెలిసింది!

ప్రాచీన సాహిత్యం పాఠమైనప్పుడల్లా
నా ముఖకవళికలన్నీ మారిపోయేవి
బయటపడకూడదనో
పారిపోవాలనోబహిష్కరించాలనో
అనుకొంటుండేవాణ్ణీ
మూకుమ్మడిగా కళ్ళన్నీ నాపైనా ఫోకస్!
ఎన్నిసార్లు చంపుతావంటూదేవుణ్ణి కాలర్ పట్టుకోవాలనిపించేది!!

నాకు తెలీదు
అమ్మగర్భంలో నయినా అవమానాలకి దూరంగా ఉన్నానోలేదో
బాబుకి కాలుమీద మచ్చెలా వచ్చిందని
ఈ మధ్యనే అమ్మనడిగితే
ప్రశ్నించటం నేర్చుకుంటున్నాడేమవుతుందోనని
అనుకుంటూ తడబడతూనే చెప్పింది.
"నువ్వు కడుపులో ఉండగా పెద్ద తుఫానొచ్చింది
ఊళ్ళో జనమంతా పెద్దోళ్ళీంటికెళ్లిపోయారు
నేనూ కడుపీడ్చుకొంటూకాసింత చోటిమ్మని బతిమిలాడాను
మైలపడిపోతేచచ్చిపోతామంటూ లోనికేకాదు
పంచకే చేరనివ్వలేదు!
రివ్వురివ్వునగాలి
పెద్దపెద్ద ఉరుములు
హోరుహోరున వర్షం
ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలీదు
కూకటి వేళ్ళతో కూలిపోతున్నా
ఆచెట్లే దిక్కయ్యాయా రెండ్రోజులూ!
తుఫాను వెలిసిన మర్నాటికి
ఆకలితో నకనకలాడి కళ్ళు తిరిగి పడిపోయాను
నిండుచూలాల్ని బతికించమని
ప్రాధేయపడుతూమళ్ళా పెద్దోళ్ళింటికే వెళ్ళాడు మీ బాబు
పొద్దుకాలమంతా పెద్దోళ్ళకే కదా పనిచేసేది
కాసిన్ని గెంజినీళ్ళయినా పోయమని అర్థించాడు
కట్టెలు కొట్టుకొస్తే పోస్తామన్నారు
ఖాళీ కడుపుతోనే
తూలిపోయినాకట్టెలతో పాటు
కాలూ గాటుపెట్టుకోనైనాకాసిన్ని గెంజినీళ్లు సంపాదించాడు!
గుక్కెడు మాత్రమే గుటకేశాను
కడుపులో ఇమడలేదు
మీ బాబు రుచిచూస్తే తెలిసింది
పెద్దోళ్ళు పోసింది బియ్యం కడుగేనని!"
ఇంకెన్ని గుండెల్లో చాచుకున్నారో
గుచ్చి గుచ్చి అడిగితే తప్ప నాకు చెప్పరెప్పుడూ!
ఈ కులంలో పుట్టడమే మంచిదయింది
లేకపోతే మనుషుల్ని ప్రేమించలేకపోయేవాణ్ణేమో
అనమానాలకి తట్టుకోలేకఆగ్రహం పట్టలేక హత్యలెన్నింటినో చేసేసే వాణ్ణేమో!
(కడుపు మీద కొట్టకుండ్రి 2001- కవితాసంకలనం)
-డా.దార్ల వెంకటేశ్వర రావు

2. మా వూరు నవ్వింది

Posted by డా.దార్ల On 2:40 AM 1 comments

కథల్లోనో, టీవీల్లోనో సినిమాల్లోనో...
పచ్చని పొలాల్ని చూసినప్పుడల్లా
మాయమ్మా బాబుల్తో కలిసి
పురుగుల్ని పాముల్ని లెక్కచేయకుండా
రాత్రుల్ని ఎన్నింటినో లాంతరు బుడ్డుల్తో పగటిగా మార్చుకొని
గుల్లల్తోను, గూడల్తోను నీటి చుక్కల్నే తడుపుకున్న నా కళ్ళలో
పాత దృశ్యాలేవో పలకరించిపోతుంటాయి
రాత్రంతా గూడ తోడి తోడీ
గాయాల చేతుల్తోనే పొద్దున్న కారం పచ్చడి నూరుతూ
మా కళ్ళకు కనిపించకుండా మాయమ్మ పడిన బాధంతా గుర్తొచ్చి
అర్థాంతరంగానే ముగించేసి ఉండగట్టికి పోతుంటాను
హుస్సేన్ సాగర్, గండిపేట్, హిమాయత్ సాగర్...
ఏ నీటి గలగలల్ని దర్జాగా చూస్తున్నా
మా వూరిలో ప్రవహించే కాల్వలే నా కళ్ళలో...!

గోచి పెట్టుకునో, చిరిగిపోయిన లాగు కట్టుకునో
తుప్పల్ని నరికి నరికీపూడికల్ని తీసి తీసీ
వంపుసోంపుల్తో వయ్యారాల్ని నేర్పి నేర్పీ
కిలకిల నవ్విస్తూ పంటచేలల్లోకి ప్రవహింపజేసినఆకాల్వలే నా కళ్ళలో...!
అందరూ వూరిని గొప్ప గొప్పగా కీర్తిస్తుంటే
నాకు మరేదోలా వర్ణించాలనిపిస్తుందెందుకో!

నా యీడు పిల్లలంతా బళ్ళో కేరింతలు
గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చాట్లు...
దొంగ చాటుగా నేను బళ్లో దూరితే
`మనం సదూకోకూడదంటే యున్వేందిరా'
భయపెట్టే గ్రామ పెత్తందారీతనం
మాయమ్మా బాబుల గొంతుల్లో
ఆవేదన జీరకుసజీవ సాక్ష్యాలుగా
నాకనిపించే మావూరి పాఠశాల, పశువులపాకలు !

నన్నో కులం గుంపులోనో ఎన్నికల దొంగ ఓటరుగానో
అక్రమ కేసుల్లో బనాయించిన నేరస్థుడిగానో
అవసరానికో చలిమిడి ముద్ద చేసుకున్న మావూరు నను చూసి నవ్వింది!
దళితయుగం
మా వూరు నన్ను చూసి మళ్ళీ నవ్వింది!

చెట్టెక్కో పుట్టెక్కో
పట్టెడన్నంతో కడుపునిండా కొడుక్కి అక్షరాలు నింపడంతో
ఊరు అర్థంచేసుకోవాల్సినన్ని డిగ్రీలు అందుకోవడం చూసి మళ్ళీ మా వూరు నవ్వింది!
తప్పనిసరి పరిస్థితుల్లో మా బాబే కత్తిరింపు చెయ్యడం వల్లనే
మోనిగనిగలాడే దువ్విన తలతోనే
నిలువెత్తు మనిషిగా నిలబడిన నన్ను చూసి
మా వూరు మళ్ళీ నవ్వింది!
అయినా మా వూరిని నేను మరిచిపోలేను
అక్కడక్కడా రహస్య ద్వారాల రాగబంధాలుంటాయి కదా!
వాటిని బహిర్గత రహదారులుగా మార్చేందుకే
మళ్ళీ మళ్ళీ మా వూరికే నా ప్రయాణం!
(ఆదివారం ఆంధ్ర జ్యోతి 20 ఆగస్టు 2000)(`రంజనీ వారి `మా ఊరూ _ సంకలనం)
-డా.దార్ల వెంకటేశ్వర రావు

Posted by డా.దార్ల On 2:31 AM 0 comments

3. `నభూతో నభవిష్యతీ


పొద్దు నడినెత్తినైనా దాటకుండానే
జీవితంలో సంధ్య మసకలు
దారిపొడవునా
పెదవి దాటని పన్నీటి జల్లుల
ఆలింగన మరకలు !
అలంకరించబడి నట్టింట్లో అమరిన డస్ట్ బిన్

సీటుప్రక్కనే లిప్తకాలం
సింహదరహాసమైయ్యే కుక్కపిల్ల
నన్ను చూసి పగలబడిన నవ్వు!

మోసగించటమో
మోసగింపబడటమో
బతుకు బంగారుబాటకు నిర్వచనమేనా...
నవ్వుతూ నరకాన్నయినాముద్దుపెట్టుకోవడం నయంకదూ!
జీవన చౌరస్తాలోకొచ్చిన కొత్తలో
వెలుగులు విరజిమ్మిన వసంతమింత తొందరగా
భవిష్యమొగ్గల్నీ చిదిమేసి శిశిరమైన చీకటి అవతారం!

రంగుల ప్రపంచం

అద్భుత రూపం
వికృతమై వెక్కిరిస్తూరక్తసిక్తమైన కాన్వాస్!
పరాయి మెచ్చుకోలు తీర్చుకోవటానికే
ఎండమావుల్లో నిస్సత్తువైయ్యేంత వరకూ పరుగు!
కనిపెంచిన ఇన్నేళ్ళ తల్లికి

ఊతమై నిరీక్షిస్తున్న ఆశల కర్రని కాల్చే
పిడుగుపాటి కానుక గర్భశోకం!
(ఆదివారం ఆంధ్రభూమి 18 జూన్ 2000)
-డా.దార్ల వెంకటేశ్వర రావు

Category : edit post
Posted by డా.దార్ల On 2:25 AM 2 comments

4. ఎక్సరే రిపోర్ట్!


అద్దం ముందు నిలబడిన నిజం
ఎక్సరే తీసి ఎగతాళి చేస్తుంది నన్ను
రమ్మని ఎన్ని సార్లు రాసినా
ఇంటికెళ్ళి మళ్ళీ తియ్యని మాటలతో
జీవరహిత ముఖం చూపడానికిష్టం లేకనే బిజీ వేషం!
ఉత్తరం రాయటం నేరమే
అబద్దాల్నీ అందంగా పోస్టుచేసి
భ్రమల్ని పెంచుకొనేలా చేసే
ఉత్తరం రాయటం నేరమే!
రోజూ ఉత్తరానికెదురు చూసే చూపులకి
పోస్టుమేన్ కైనా
తానే ఓ ఉత్తరం రాయాలనిపించదూ...!
ఉత్తరం రాయకుండానే
రోజూ ఉత్తరానికెదురు చూసే నాకు
పోస్టుమేన్ నిట్టూర్పులే సజీవ సాక్ష్యం
అయినా అబద్దాల్ని అందంగా పేర్చి
ఫిరంగి నెప్పుడో హఠాత్తుగా పేల్చేయటమెంత నేరం!
నగర వీధుల్లో నేను నాకు నేనే మోసం
శోధనో... పరిశోధనో...? వినయం బానిసత్వమైతే జీవితం మోయలేనంత బరువు
క్యాజుయల్ లైఫ్...
ఆకాశవాణి నా ఆశాగానంలో చైతన్య ప్రబోధమో, యుగళగీతమో
నిరాశను గొంతులోనే కూరుకొంటూ `క్యూ' చెయ్యటం
అద్దం ముందు నిలబడిన నిజం
ఎక్సరే తీసి నన్ను ఎగతాళి చేస్తుంది
గర్భంలో రూపింపక మునపే నన్నెరిగిన దేవుడా...
లోకానికిన్ని నమూనా పాత్రలవసరమా!
విషాదమెంత తియ్యగా మారిపోయింది
ఇక చెలమను మూసేయ్యలేను
పాదరస మట్టం పైకొచ్చేసి గాజునాళం పగిలిపోయినా సరే!!
(ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 2001)
- డా.దార్ల వెంకటేశ్వర రావు

Category : edit post
Posted by డా.దార్ల On 11:47 PM 6 comments

5. అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ

తొమ్మిది నెలలు నిండక ముందే
ప్రపంచంలోపడిన సంబరంతో
సంకని సంచి తగిలించిన మరుక్షణమే
నా చేతిలో...
పిచ్చుకకు రాబందు రెక్కలొచ్చిన సమాచారం
నమ్మకం నరకబడుతున్నట్లు
నీకు రెక్కలెలా వచ్చాయి
చందమామని వదలి ఉండలేనని
ఒట్టేసుకున్న వెన్నెల
ఏ సూర్య కిరణస్నానంలోనో వెలిసిపోయి
శుక్లపక్షాన్నంతా కృష్ణపక్షానికిచ్చేసిందో
చంద్రునికింక ప్రతిరాత్రీ కాళరాత్రే!
వెన్నెల్ని పున్నమిరాత్రుల్నీ చేసి విహరించటం
పచ్చని బీడుల్లో జల్లులన్నీ తొలకరి చినుకులుగా
మార్చుకొని గంతులేయటం
కాగితాల పడవల్లో కలల్ని సాగనంపటం
నీ అందెల రవళే నా ఓంకారనాదసుప్రభాతాలుగా విన్నక్షణాలు...
ఇక ఇవన్నీ
హృదయ పేటిక చివరి అరలో చాచుకున్న
చిన్ననాటి ఫోటోలయిపోవలసిందేనా?
ఏమని చెప్పనీ పిచ్చి చకోరపక్షికి?
కాగడాలు ఆరిపోకుండా
చమురు తేవటానికే
ఆఘమేఘాలమీద ఆ దేశానికి పోయావని చెప్పనా?
అదేమీ కాదు... అల్లుకొనే లతకీ
ఎన్నాళ్ళకీ పందిరి కాలేకపోయిన
అసమర్థుడిపట్ల అసహనమని చెప్పనా?
కాదు కాదు....
నీకామ మోక్ష ధర్మంఇప్పుడిప్పుడే
`అర్థమవుతుంది
పవిత్రప్రేమను కూడా
అంతర్జాతీయ మార్కెట్
ఏ బలహీనతతోనో లోబరిచేసుకుంది కదూ!
నువ్వు నుదుటి మీద కుంకమ బొట్టుపెట్టుకొనేటప్పుడు
అద్దంలో చూసుకోవద్దు
అధరామృత స్మృతి
విషబిందువై తాకిన తొలగని మచ్చేదో గుర్తొస్తుంది!

మూతబడని ఈ మూగదృశ్యాన్ని
తొలివేదనకే రాలిన మూత్యాల గుసగుసల్ని
ఏనాడైనాఇంటర్ నెట్ నుంచైనా తీసుకొని ధరించే వీలుందా?

పోన్లే...
కనీసం పోయేముందైనా
నీకనుకొలికి కోటి కాంతుల్లో
ఓ కిరణాన్నైనా విదల్చలేకపోయావా
దానితోనేపవిత్ర సైనైడ్ కౌగిలిలో మిగిలిపోయుండేవాడ్ని!!
(ఆదివారం ఆంధ్రజ్యోతి 30 ఏప్రిల్ 2000
-డా.దార్ల వెంకటేశ్వర రావు
dalit@vrdarla.org

Category : edit post
Posted by డా.దార్ల On 11:34 PM 1 comments

6. ఆ రాత్రి


ఆ క్షణంలో ఎందుకలా విలవిల్లాడిపోయాను
ఏ అనుబంధాన్నో నాలో ఫిక్సిడ్ డిపాజిట్ చేసీ
అర్థాంతరంగా లాగేసుకొన్నట్లు
ఆక్షణంలో ఎందుకలా విలవిల్లాడిపోయాను

గదిలోకొస్తే ఏదో కోల్పోయిన వెలితి
నిండిపోతున్న ఒంటరితనం
బరువెక్కి పోతున్న హృదయం
భవిష్యత్తు ముందే తెలియడమెంత నరకం!

బయటికి పోతే
నీతో విహరించిన స్థలాల వెక్కిరింత
ప్రతిదానిలోనూ నువ్వే
నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది!
నువ్వెళ్ళి పోయే తారీఖు నుర్ణయమైనప్పుడే
నాలో ప్రవేశించిన ఆందోళన, అసహనం...!
శత్రుముసుగు కప్పడానికెంత ప్రయత్నం
నిన్ను జయించలేకపోతున్నాను

ఉషః కాల తుషార బిందువూ
ఈ సాయంకాల సూర్యకిరణాలు
అలాగే నిలిచిపోవాలనుకున్నా
ఎక్కాల్సిన రైలూ, దిగాల్సిన ప్లాట్ ఫారం
జీవన్మరణ ప్రయాణాల రైలాగదు!

అమావాస్యకు దగ్గరవుతున్న చందమామ
జీవితాన్ని రోజూ భయపెడుతుంది

మమతాను భంధాల్ని పెంచుకోవటం
రాగద్వేషాలు త్రుంచుకోవటంజీవులకే కాదు.
స్థలకాలాలకీ అతీతంకాదేమో!!
-డా.దార్ల వెంకటేశ్వర రావు

dalit@vrdarla.org

Category : edit post
Posted by డా.దార్ల On 11:29 PM 0 comments

7. పరివర్తన


నా నయనేంద్రియాల్లో ]
మిళితమైననిజాల్ని విడదీసి ప్రసరించడానికి భయపడుతుంది చూపు!
నా పెదవులు
నరంలేని నాయకత్వానికెందుకో
వణికిపోతూ వాక్కుల్ని భీమా చేసుకొంటున్నాయి

ఒక మౌనం మాట్లాడి మనసుని దహించేస్తుంటే
మరొక మౌనం ఘనీభవించి
నన్నో అనిశ్చితలోయలోకి తోసేస్తుంటుంది

నా శరీరంలో నాదికాని ప్రాణం చేసే స్వారీకి
ఇంకెంత కాలమిలా అలసి పోవాలి!
ఏసీ రూములోని గడియారపు పెండ్యూలమై
ఉక్కబోసి ఊపిరాడక నలిగిపోతూ
కాలంతో కసరత్తూచేసే కంటే
నాపూరిగుడిసెలోనే
ఎండలోనో, వానలోనో, చలిలోనో
ఎండిపోయి, తడిసిపోయి, వణికిపోయైనా
అలసిన కళ్ళనిప్పుడు
నాకనురెప్పలతో నే కప్పేసుకోవాలనుంది!
-డా.దార్ల వెంకటేశ్వర రావు
(ఆదివారం ఆంధ్రభూమి 16 ఫిబ్రవరి, 1997)

Category : edit post
Posted by డా.దార్ల On 11:24 PM 0 comments

8. నీరాగంలో...!

అలా తడుస్తున్నంత సేపూ
నాలో ఎక్కడనుండి ప్రవహిస్తుందో
తనువంతా కాంతులీనుతున్న ఓ విద్యుల్లత!

ఏకాకిని చేసి భయపెట్టే
నిరాశ నిశీధికి నిలయమైన నా కళ్ళు
తేజోవంతమై మెరిసిపోతున్నాయి
ఒక అణువునై పోయైనా
ఆ స్వరజల్లుల్లో లయాన్వితం కావాలనుకొనే
నా ఇన్నేళ్ళ తఫః ఫలానికో
సుమధుర సుందర సాక్షాత్కారం!
-డా.దార్ల వెంకటేశ్వర రావు
(`మూసీ' ద్వైవార్షిక ప్రత్యేక సంచిక, నవంబరు_డిసెంబరు 1999)

Category : edit post
Posted by డా.దార్ల On 11:20 PM 0 comments

9.ఒక తాత్త్వికలోకంలో..!


నువ్వు నాకళ్ళల్లోకి చేరి
ఆకాశమంతటా
దృశ్యాదృశ్యాలతో
కాంతి గీతాల్నీ నింపేస్తుంటావు
నీలో లీనమైనప్పుడల్లా
ఉన్నత్తమైన పోటీకి
పోటీగా మారకుండా
ప్రఫంచమే నేనౌతూ
ప్రపంచాన్ని మించిన అస్తిత్వమేదో
కొట్టుమిట్టాడుతుంటుంది!
(ఆదివారం ఆంధ్రభూమి 24 జనవరి 1999)
-డా.దార్ల వెంకటేశ్వర రావు

Category : edit post
Posted by డా.దార్ల On 11:13 PM 0 comments

10. తీయని బాధ చేసిన గాయం!



ఆ జాలి చూపులే
మదిని కల్లోల ప్రాంతంగా ప్రకటిస్తున్నాయి
ఆ మౌనమే
నా కనులలో కనిపించని
కన్నీటిని ప్రవహించేలా చేస్తుంది
ఆ సహనమే
నన్ను పట్టుకొని కుదిపేస్తుంది
ఆ చిలిపి కోపమే
నన్ను చంటిపిల్నాడ్ని చేసిలాలిస్తోది
నిస్సహాయతా? బలహీనతా?
నిర్లక్ష్యమా? గర్వమా?
నీదా ? నాదా ?
ఏమర్థంకాని సుడిగాలిలా వెంటపడే శేషప్రశ్నలు!
ఏమర్థం కావడంలేదు
సమస్యల ఖైదీలో బంధితుడ్నైయ్యాను
దానికి నేనే తాళాలు వేసుకొని
నా స్వేచ్చను నేనే బంధించుకున్నాను
ఎంతో ఎత్తుకెదగాలనుకొనే
ఆనంద విహంగానికున్న రెక్కల్ని విరిచి
ఆవేదన మూల్గులు వింటున్నాను.

రక్షకభటులై పోతున్న చేతులు
మనసురొదపెడుతున్నా కట్తేసుకొని కదలనికాళ్ళు
ఆలోచిందని క్షణంలోనైనా
దయ జలపాతమై వర్షించకమానడంలేదు
దానివల్ల `ఫలం' ఎవరికీ దక్కదని ఎలాగూ తెలుసు
విచిత్రమేమిటో గానీ...
ఆ నీటితో మానస క్షేత్రం మాత్రం దహించుకు పోతోంది!

పుస్తకాలు, పరీక్షలు, అక్షరకుసుమాల జల్లుల్లో తడుస్తూ
కోరికల మృగాలకి జడుస్తూ
చేస్తున్ననా తపస్సు ఫలించాలని ఆకాంక్షిస్తావే
మరి నిజం చెబితే నమ్మవేమి?
అబ్దదం చెప్పి నిన్నో అగాథం లోకి తోయలేను
అగ్ని జ్వాలలకు
నీ అరిటి మొవ్వు మనసుని హారతి చేయలేని నిస్సహాయుడ్ని!
ఈ మనసు విధించిన కర్ఫ్యునుండి నన్ను బ్రతికించవూ!!
(1995- `ఇంకాఉందీ పత్రిక)
-డా.దార్ల వెంకటేశ్వర రావు
lovepoetry@vrdarla.org

Category : edit post
Posted by డా.దార్ల On 10:54 PM 0 comments

11. పుట్టుమచ్చ మీద ప్రేమ



పుట్టుకతో వచ్చిన మచ్చ
ఒకడికి అందమైన అలంకారంగాను
మరొకడికి అసహ్యంగాను మారుతుంది

నాకున్న పుట్టుమచ్చలో
నా ఎదుటి వాళ్ళకేమి దర్శనమవుతుందో
శత్రువు+శత్రువు = మిత్ర బృందం!

భిన్న భావజాలాలైనా
రహస్య రణవ్యూహంలో
వాళ్లదంతా ఒకే దృక్పథం
రేపు యుద్ధానికెళ్ళాలని తెలిసీ
ముందు రాత్రి
శత్రుపాదాల్ని
ముద్దుపెట్టుకోవటమెందుకు?
అలంకారమో, అసహ్యమో
నాపుట్టుమచ్చ మాత్రం
నాకు రక్షణ కవచమేనని గుర్తు చేసింది
ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికీ
వెన్నుపూసై నిలిచిన
సౌందర్య రమణీ నాపుట్టుమచ్చా!
నిన్ను నేను ప్రేమిస్తున్నాను!!
-డా.దార్ల వెంకటేశ్వర రావు
(ఆదివారం ఆంధ్రభూమి 4, అక్టోబర్ 1998)
puttumaccha@vrdarla.org
dalit@vrdarla.org

Category : edit post
Posted by డా.దార్ల On 2:47 AM 0 comments

12. హాస్టల్లో అమ్మ!



మా యూనివర్శిటీ హాస్టల్లో
మిగిలిన అన్నం పట్టికెళ్ళడానికి
తెల్లవారగట్ల వచ్చే తల్లి దీన వదనంలో
మా అమ్మ రూపం అందంగా కనిపిస్తుంది.
నన్ను పెంచిన తీరు ఆ తల్లి లో ప్రతిబింబిస్తుంటే
నా కళ్ళ ఎడారిని
ఓ జాలి నిట్టూర్పు ఆర్ద్రమై తడుపుతంది దయతో!
మా ఊరి పెళ్ళి పందిళ్ళలో
అమ్మ చేతుల్లో ఆకలి పాత్రనై ఒదిగినప్పుడు
చెత్త కుప్పల్లోనైనా పడేసి రంకేసే
కర్కశ కేకలకు తల్లడిల్లిన నా తల్లి హృదయాన్ని
అప్పుడప్పుడూ చూస్తుంటాను నిస్సహాయంగా!
చీకటి గదిలో ఒంటరినై
నాలో నేను కొట్టుకు పోతుంటాను కన్నీటి కెరటాల్లో!
ఎక్కడ్నుండో అమ్మ అమృత హృదయమై
లాలిస్తుంది
జోలపాడుతుంది
ఆకలీ అవమాన ప్రపంచాల్నిజయించమంటూ
మేలుకొలుపు గీతాల్ని వినిపిస్తుంది!
-డా.దార్ల వెంకటేశ్వర రావు

( ఈ కవిత రంజని వాళ్ళు ప్రచురించిన "అమ్మ" కవితా సంకలనంలో కూడా ఉంది)
hostel@vrdarla.org
mother@vrdarla.org


Category : edit post
Posted by డా.దార్ల On 2:40 AM 0 comments

13. కూలుతున్న లైబ్రరీ!


ఏదైనా మాయో, మంత్రమో, యంత్రమోవుంటే బావుణ్ణు
తొందరగా లైబ్రరీ పుస్తకాలన్నీ ఔపోసన పట్టేసేవాణ్ణి
గ్లోబలైజేషన్ అరచేతిలో స్వర్గం
ఇంటర్నెట్ మోహినీ రూపం
అమృతానికిక అవతలుండాల్సిందే నేమో...!
అమ్మనులివెచ్చని కడుపులో కేరింతలు కొడుతున్నట్లో
యౌవనం కరిగిపోకుండా కలకాలం నిలచిపోయినట్లో
లైబ్రరీ నెప్పుడూ విడిచి రాకూడదనిపిస్తోంది
సీసం కరిగిపోయిన చెవుల్ని ఏరాక్ నుండో
విందుల కాహ్వానిస్తూ వేదఘోషలు!
అక్షరం ఒకవైపు
అన్నం మరోవైపు పెడితే
నేను అక్షరాన్నే హత్తుకుంటాను ఆబగా!
మాతాత ముత్తాల నుండీ మడతలు పడినా
ఆ పొట్లల్ని సాగదీసి చూస్తే
అంబలైన దొరుకుతుందేమోగానీ
అక్షరం ముక్కమాత్రం కనబడనివ్వలేదుకదా !
అక్షరమంటే అందుకేనేమో నాకంత ఆత్రం!

తొందరగా ఏదొకటి చెయ్యాలి
రిక్టార్ స్కేలు మీద ప్రమాద సూచికలు
ఇంటర్నెట్ ప్రకంపనల్తో లైబ్రరీగోడల్లో పగుళ్ళు
మరోవిలీనీయం చాకా వెతికినా
నాకిక అక్షరం ముక్క మళ్లీ కనిపించదేమో

లైబ్రరీలోనే చచ్చిపోయి,
మళ్ళీ లైబ్రరీలోనే ఓ పుస్తకమై పుట్టాలనే కోరిక
పుట్టుకతోనే చచ్చిపోవాల్సిందేనేమో!
-డా.దార్ల వెంకటేశ్వర రావు
(కడుపుమీద కొట్టకుండ్రి 2001 - కవితాసంకలనం)

Category : edit post
Posted by డా.దార్ల On 2:32 AM 0 comments

14. గోడకివతలివైపు...!



నీతో గడిసినంత సేపూ
పరిమళభరిత సరస్సులో క్రీడలాడినట్లే వుంటుంది
హృదయం నిర్మలమై
ప్రశాంత కిరణాల్ని వెదజల్లుతూనే వుంటుంది
ఉత్సాహం మనసునిగాలిలో ఆకాశమంతా చెట్టపట్టాలేయిస్తుంటుంది

కొట్టినబంతికి చైతన్యమై
సంఘర్షణ శక్తినిస్తూనే
నీసమ్మోహన శక్తి ముందు
అన్నింటినీ మరిచి శిలనై పోవాలనుంటుంది


మరి మనమధ్య నిలువెత్తు అద్దాలగోడలు
నిన్ను ప్రత్యక్షంగా స్పర్శించి
పులకిరించనివ్వని అద్దాల గోడలు

బలవంతంగా
నాచేతనే తాకట్టు పెట్టబడిన
నా వస్తువు మీద నాకే పెరిగిపోతున్న వడ్డీ మాత్రం
రాబందులా ముఖాన్ని రక్కేస్తుంటే
స్రవించేది రక్తం కాదు
సిగ్గుతో నేలకొరిగిపోతున్న చెమటచుక్కలు!
సూటిగా ఎలా చూడగలను నీ కళ్ళలోకి!!
ప్రలోభం
ఇంద్రజాలం ప్రదర్శించే అద్భుత వశీకరణశక్తి!!
- డా.దార్ల వెంకటేశ్వర రావు
(`సాహితీ ఆంధ్రభూమి 6 అక్టోబరు 1997)
lovepoetry@vrdarla.org

Category : edit post
Posted by డా.దార్ల On 2:24 AM 0 comments

15. సత్యాన్వేషి!

అక్కడ ఆశల గూళ్ళలో సీతాకోక చిలుకలు
రంగురంగుల కథలు చెప్పుకొంటున్నాయి
వృద్దాప్యం ముద్దుముద్దుగా
అడుగులు నేర్చుకొంటుందని
అమ్మానాన్నల అదృశ్యవాక్కు
చేతికర్రనందించమని అడుగుతునే వుంది

నేనేమో
సముద్రలోతుల్లో కెళ్ళి
తిమింగలాల్తో పోట్లాడుతున్నాను
పర్వతాలెక్కి మేఘాల్తోనూ
ఎర్రనెర్రని సూర్యుళ్లతో
ఏవేవో చర్చల్లో తలమునకలవుతున్నాను

ఇంగిత జ్ఞానమేమో
ఇసుమంత దాచకుండానా
లోనన్ను జల్లెడవేసుకోమంటుంది
నిట్టూర్పుల వడగాల్పులు తగలకముందే
శూన్యదృక్కులు చూడకుండా ఇప్పటికైనా మేల్కోమంటుంది! !
-డా.దార్ల వెంకటేశ్వర రావు

(ఆదివారం ఆంధ్రప్రభ, 13 అక్టోబరు 1996)

Category : edit post
Posted by డా.దార్ల On 1:21 AM 0 comments

16. కల అదృశ్యం కాదు



కలల అలలపై చెంగు చెంగున గంతులేస్తుంటే
కలలెంత తీయగా ఉంటాయి
కనిపించని ఊహల పుష్పక విమానంలో
విహరించే వినోదాల విశాల బృందా వనమెంత అందంగా ఉంటుంది
కళ్లు తెరిస్తే కన్నీళ్లెంత స్వచ్ఛంగా ఉంటాయి?
మళ్లీరాని బాల్యస్మృతులు
పూర్వ జన్మ వాసనలై మనసంతా గాయమైపోతుంటుంది
మాడ్చుకుని తిన్న ఆకలి మాయమ్మ పాదాల మీద పడి ఏడుస్తుంది
పుడుమా యమ్మే స్వయంగా ఉత్తరం రాస్తుంది
స్వయంగానే ఉత్తరం చదువుతుంది
మాయమ్మ కూడా పట్టుచీర కట్టుకుని పేరంటానికెళుతుంది
ఫ్యాన్ కింద కబుర్లతో కలర్ టీ.వీ. `ఠీవీ' గా చూస్తుంది
పుణ్యక్షేత్రాలెన్నింటినో సందర్శిస్తుంది అధికారికంగానే

మాయయ్యేమో... తెల్లపంచెలో మహారాజై మీసం మీద చెయ్యేస్తున్నాడు

నాకింకేమి కావాలి? కోర్కెల గుర్రం ఎక్కేస్తాను.

`కొక్కొరొకో' అన్న యథార్థ ఫిరంగికి విరిగిపడిన కలల శకలాలు నన్ను కప్పేశాయి
దృశ్యాల్ని శాసించే నియంతనైతే ఎంత బావుణ్ణు!
-డా.దార్ల వెంకటేశ్వర రావు

(దీపావళి ప్రత్యేక సంచిక, ఆంధ్రప్రభ వీక్లీ)13 నవంబరు 1999)

Category : edit post

About Me

My Photo
డా.దార్ల
Dr.Darla Venkateswara Rao, Assistant Professor, Dept .of Telugu, University of Hyderabad, (Central University), Gachibowli, Hyderabad-500 046 e-mail: vrdarla@gmail.com Ph: 040-23133563 (O), Mobile: 09989628049,
View my complete profile

కొన్ని రచనలు